High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్… అధికారిక పేజీపై బెట్టింగ్ లింక్ ప్రత్యక్షం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో సైట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. మరింత ఆశ్చర్యం కలిగించేలా హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ స్థానంలో ఏకంగా ఓ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, హ్యాకర్లు వెబ్‌సైట్‌ను ఎలా యాక్సెస్ చేసారు? సర్వర్‌లో ఏవైనా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
Details
ఇబ్బందుల్లో వినియోగదారులు
ఈ హ్యాకింగ్ కారణంగా కొంతసేపు హైకోర్టు వెబ్‌సైట్ సేవలు పూర్తిగా అంతరాయం చెందాయి. ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు, ఇతర ముఖ్య పత్రాలు యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిస్టమ్ భద్రతను బలోపేతం చేయడానికి టెక్నికల్ టీమ్స్ తక్షణమే చర్యలు ప్రారంభించాయి. హైకోర్టు వంటి కీలక సంస్థ వెబ్‌సైట్‌కు హ్యాకింగ్ జరగడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.