LOADING...
Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం 
నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం

Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

హైడ్రా నిర్మాణాల కూల్చివేత విధానం పట్ల హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జీవో 99 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం సరికాదని స్పష్టం చేసింది. కేవలం పత్రాలను పరిశీలించడం ద్వారా హక్కులను నిర్ధారించడం సాధ్యం కాదని, ఆ అధికారం హైడ్రాకు లేదని హైకోర్టు ప్రశ్నించింది.

వివరాలు 

చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా కూల్చివేతలు ఎందుకు? 

హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, నోటీసులు ఇచ్చి, సమయం కల్పించి, చట్టపరంగా ముందుకెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా, హైడ్రా విధానం మారడం లేదని నిలదీసింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తన స్థలంలోని నిర్మాణం ఆదేశాల మేరకు కూల్చివేయబడిందని పిటిషనర్‌ ఎ. ప్రవీణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ విచారించారు.

వివరాలు 

హైడ్రా చర్యలు, న్యాయపరమైన వాదనలు 

హైడ్రా తరఫున ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, "గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్" ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే 2023 నవంబరు 15న పంచాయతీ నిర్మాణ అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదిస్తూ, "పిటిషనర్‌ అనుమతులు అక్రమంగా పొందాడు, అందుకే వాటిని రద్దు చేశారు" అని పేర్కొన్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందని చెప్పారు. న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ,ఇలాంటి అనేక కేసులలో తాను ఇప్పటికే 20కి పైగా ఉత్తర్వులు జారీ చేశానని పేర్కొన్నారు.

వివరాలు 

హైకోర్టు ప్రశ్నలు, కీలక వ్యాఖ్యలు 

2023లో ఇచ్చిన అనుమతులను 2025లో ఎందుకు రద్దు చేస్తున్నారు?అంత కాలం ఏమి చేశారు? గాయత్రి అసోసియేషన్ హైడ్రా వచ్చేదాకా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?పార్కు స్థలంగా నిర్ధారించడానికి హైడ్రాకు అధికారం ఉందా? అంతేగాక,పార్కు స్థలంపై ఆక్రమణ జరిగితే ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సివిల్ కోర్టు నిర్ణయం లేకుండా కబ్జాదారిగా ఎలా పేర్కొంటారు?సివిల్ కోర్టు నిర్ణయం లేకుండా, పిటిషనర్‌ను కబ్జాదారిగా ఎలా పేర్కొంటారు? సర్పంచ్‌కు లేఔట్‌ అనుమతులిచ్చే అధికారం ఎక్కడుంది?హైడ్రాచర్యలు చట్టప్రకారమే జరగాలని, ప్రస్తుతం స్థితి యథాతథంగా కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రాకు వివరణాత్మక కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.