MeeSeva Charges: మీసేవ ఛార్జీలు 50% పెంపు.. జీఎస్టీతో కలిపి దాదాపు 78% భారం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచింది. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పౌర సేవలపై 18 శాతం జీఎస్టీ కూడా విధించనుంది. దీంతో పెరిగిన ఛార్జీలతో పాటు పన్ను భారం కలిసిపోవడంతో మొత్తం ఖర్చు సుమారు 77-78 శాతం వరకు పెరిగినట్లైంది. ఈ నిర్ణయం వల్ల సేవలు పొందే సాధారణ ప్రజలు, విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
వివరాలు
స్కానింగ్ లేదా ప్రింట్‌కు ఒక్కో పేజీకి రూ.2.5
తాజా మార్పులతో కేటగిరీ-ఏ సేవల ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి, కేటగిరీ-బీ సేవల ఛార్జీ రూ.45 నుంచి రూ.80కి పెరిగింది. కేటగిరీ-ఏలో అదనపు పత్రాలు లేదా సంబంధిత శాఖ పరిశీలన అవసరం లేకుండా సేవలు అందిస్తారు. కేటగిరీ-బీలో మాత్రం సంబంధిత విభాగం విచారణ, పరిశీలన తర్వాత సేవలు అందుతాయి. ఇప్పటివరకు వినియోగ ఛార్జీ చెల్లించడం ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉండేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం నాలుగు పేజీలకు మించిన పత్రాల స్కానింగ్ లేదా ప్రింట్‌కు ఒక్కో పేజీకి రూ.2.5 వసూలు చేయనున్నారు.
వివరాలు
దరఖాస్తుపై అదనంగా సుమారు రూ.35 వరకు భారం
గతంలో ఈ రుసుము పేజీకి రూ.2గా ఉండేది. ఉదాహరణకు, కుల ధ్రువీకరణ పత్రం కోసం గతంలో రూ.45 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు 50 శాతం పెంపుతో రూ.67.5, దీనిపై 18 శాతం జీఎస్టీ కలిపి మొత్తం రూ.79.65 (రౌండ్ ఫిగర్‌గా రూ.80) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో దరఖాస్తుపై అదనంగా సుమారు రూ.35 వరకు భారం పెరిగింది.
వివరాలు
భారీగా పెరిగిన మీసేవ కమీషన్
మరోవైపు మీసేవ నిర్వాహకులకు లభించే కమీషన్ కూడా దాదాపు 15 ఏళ్ల తర్వాత గణనీయంగా పెరిగింది. గతంలో కేటగిరీ-ఏ సేవలపై రూ.35 ఫీజులో రూ.13 కమీషన్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు ఫీజు రూ.62కి పెరగడంతో కమీషన్ రూ.40.34కి చేరింది. అలాగే కేటగిరీ-బీ సేవలపై ప్రస్తుతం రూ.80 వసూలు చేస్తున్నందున నిర్వాహకులకు లభించే కమీషన్ రూ.52.10కి పెరిగింది. కొన్ని సేవల్లో ప్రభుత్వానికి వాటా ఉండగా, కేటగిరీ-ఏ, బీ సేవల్లో ఈ వాటా రూ.7గా నిర్ణయించారు. అయితే కొన్ని సేవల్లో ప్రభుత్వ వాటా ఉండదు.
వివరాలు
విద్యార్థుల ఆధార్ ధృవీకరణ ఫీజు పెంపు
అలాంటి సందర్భాల్లో రూ.7లో 30 శాతం ఈ-సేవ కమిషనరేట్‌కు, 70 శాతం మీసేవ నిర్వాహకులకు కేటాయిస్తారు. ఉపకార వేతనాల (ఈ-పాస్) దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ఆధార్ ధృవీకరణ ఫీజును కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూ.20గా ఉన్న ఈ రుసుమును ఇప్పుడు రూ.35గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి ఎవరైనా వసూలు చేస్తే, పౌరులు 1100 లేదా 18004251110 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.. లేదా meesevasupport@telangana.gov.in కి ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని సిటిజన్ ఛార్టర్‌లో పేర్కొన్నారు.