Telangana : ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలకు చెక్.. లెక్చరర్లకు యూనిక్ ఐడీ అమలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు,నకిలీ లెక్చరర్ల సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో లెక్చరర్ల కోసం ప్రత్యేకమైన యూనిక్ ఐడీ నంబర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ఒక లెక్చరర్ ఏ కళాశాలలో పనిచేసినా, అతనికి కేటాయించిన ఐడీ మాత్రం శాశ్వతంగా ఒకటే ఉంటుంది. ఈ ఐడీ ద్వారానే లెక్చరర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. కొత్త విధానం ప్రకారం ప్రతి లెక్చరర్‌కు ఒకే ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నారు. ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మారినా ఆ ఐడీ మారదు.
వివరాలు
ఐడీ కూడా లెక్చరర్ల ఉద్యోగ జీవితంలో కీలక పాత్ర
ఆధార్ కార్డు మాదిరిగానే ఈ ఐడీ కూడా లెక్చరర్ల ఉద్యోగ జీవితంలో కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు, సంబంధిత లెక్చరర్ సేవా చరిత్రను పూర్తిగా ట్రాక్ చేసే అవకాశం పొందుతుంది. రికార్డుల్లో మార్పులు చేసి ఒకేసారి రెండు లేదా మూడు కళాశాలల్లో పనిచేస్తున్న కొంతమంది లెక్చరర్లను గుర్తించేందుకు ఈ యూనిక్ ఐడీ ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా అలాంటి అక్రమాలు ఈజీగా బయటపడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పర్యవేక్షణలో ఈ ఐడీలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 41 వేల మందికి పైగా బోధనా సిబ్బందికి ప్రత్యేక ఐడీ నంబర్లు కేటాయించినట్లు బోర్డు తెలిపింది.
వివరాలు
కేసారి అనేక కాలేజీల్లో పనిచేస్తున్న పలువురు లెక్చరర్లు
ఈ వ్యవస్థ ద్వారా నకిలీ అధ్యాపకులను గుర్తించడం, ఫేక్ వ్యక్తులను అడ్డుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే ఒక యూనిక్ ఐడీని ఒకే సమయంలో ఒక్క కళాశాలకే అనుసంధానం చేయగలిగే విధంగా వ్యవస్థను రూపొందించారు. కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పలువురు లెక్చరర్లు ఒకేసారి అనేక కాలేజీల్లో పనిచేస్తున్న విషయం బోర్డు దృష్టికి వచ్చింది. ముఖ్యంగా భాషలు, గణితం, భౌతిక శాస్త్రం వంటి అధిక డిమాండ్ ఉన్న సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు పలు కళాశాలల్లో సేవలందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే లెక్చరర్‌ను వేర్వేరు వ్యక్తులుగా చూపించేందుకు పేర్లలో స్వల్ప మార్పులు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారని అధికారులు గుర్తించారు.
వివరాలు
యూనిక్ ఐడీ అమలుతో ఇలాంటి పరిస్థితులకు బ్రేక్
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం, అదనపు విభాగాలు ప్రారంభిస్తే వాటికి తగిన సంఖ్యలో కొత్త లెక్చరర్లను నియమించాల్సి ఉంటుంది. అయితే అనేక కళాశాల యాజమాన్యాలు ఇప్పటికే ఉన్న సిబ్బందితోనే అదనపు సెక్షన్లను నిర్వహిస్తూ, లెక్చరర్లపై బోధనా భారం పెడుతున్నాయి. యూనిక్ ఐడీ అమలుతో ఇలాంటి పరిస్థితులకు బ్రేక్ పడనుందని బోర్డు భావిస్తోంది. అవసరమైన చోట కొత్త సిబ్బందిని తప్పనిసరిగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఇంటర్మీడియట్ విద్యలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ యూనిక్ ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఒక కళాశాలకు ఎంతమంది లెక్చరర్లు అవసరమో, నిజంగా అంతమంది పనిచేస్తున్నారా అనే విషయాన్ని ఈ విధానం ద్వారా సులభంగా నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు.