TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బుధవారం హాల్‌టికెట్లు విడుదలైన అనంతరం,విద్యార్థులు తమ కళాశాలల ఇంటర్ బోర్డు లాగిన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 20న విద్యార్థుల తల్లిదండ్రులు నమోదు చేసుకున్న వాట్సాప్ నంబర్లకు హాల్‌టికెట్లు పంపించనున్నారు. దీంతో విద్యార్థులు నేరుగా వాట్సాప్ నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేకాకుండా,ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా విద్యార్థులు హాల్‌టికెట్లను నేరుగా పొందవచ్చు.
వివరాలు
హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
అంటే కళాశాల లాగిన్ ఐడీ, ఇంటర్ బోర్డు వెబ్‌సైట్, వాట్సాప్.. ఈ మూడు మార్గాల ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులు తమకు అనుకూలమైన ఏ మార్గం నుంచైనా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి నేరుగా తీసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష రాయడానికి అనుమతి ఇస్తామని ఇంటర్ బోర్డు స్పష్టంగా వెల్లడించింది. అయితే హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు,ఫొటో లేదా సబ్జెక్టుల వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే తమ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరిచేయించుకోవాలని సూచించింది. ఈ ఏడాది హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించనున్నారు. దీని ద్వారా పరీక్ష కేంద్రం వివరాలు,రూట్ మ్యాప్‌ను సులభంగా తెలుసుకుని విద్యార్థులు నేరుగా పరీక్ష కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,529 మంది విద్యార్థులు
ఇక తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,529 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైమ్‌ను ఇస్తున్నారు.
వివరాలు
9.05 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి
టైమ్ టేబుల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రేస్ టైమ్ ప్రకారం ఉదయం 9.05 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ 2026 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.