LOADING...
Telangana local body Elections: స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే? 
స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?

Telangana local body Elections: స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు ఈ నెల 24లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనితో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, పోలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఎంపికలు, చర్యలను పరిశీలిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కొనసాగుతున్న న్యాయపరమైన సమస్యలే ఎన్నికలు వరుసగా వాయిదా పడటానికి కారణమవుతున్నాయి. కేంద్రం ముందున్న రిజర్వేషన్ల అంశం త్వరగా పరిష్కారమయ్యే సూచనలు కనిపించకపోవడంతో ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలపై ఆలోచించినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా మారలేదు.

వివరాలు 

పంచాయతీ ఎన్నికలు..  వేల కోట్ల కేంద్ర నిధులు వినియోగించలేని స్థితి 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో మంచి ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. ఈ విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని పార్టీ వర్గాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల వేల కోట్ల కేంద్ర నిధులు వినియోగించలేని స్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఎన్నికైన ప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందువల్ల ఎన్నికల ద్వారా గ్రామీణ పాలనను మళ్లీ ప్రజల మధ్యకు తీసుకురావడంతో పాటు, రాజకీయపరంగా పార్టీ బలోపేతానికి కూడా ఇది అవకాశం కాబోతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

హైకోర్టు, రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ-9పై స్టే

సెప్టెంబర్ 29న బీసీ రిజర్వేషన్లను 42 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాని అదే రోజు హైకోర్టు, రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ-9పై స్టే విధించడంతో పరిస్థితి మారిపోయింది. కోర్టు తీర్పును అనుసరించి ఆ రోజునే ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఇప్పుడు కేబినెట్ నిర్ణయాల అనంతరం కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండా

ఎన్నికల తేదీలను ఖరారు చేసే హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అయినా, పరిపాలనా-ఆర్థిక అనుమతులు మాత్రం ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రాబోయే కేబినెట్ నిర్ణయమే స్థానిక ఎన్నికల అమలుకు కీలకంగా మారబోతుందని భావిస్తున్నారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండాగా ఉండనుందని, బీసీ రిజర్వేషన్లపై ఏర్పడిన న్యాయసమస్యలు, పరిశీలించిన ప్రత్యామ్నాయ మార్గాలు, కోర్టు సూచనలపై సవివరంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు, 'తెలంగాణ రైజింగ్ 2047' కార్యక్రమాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలా? లేక అంతకుముందే షెడ్యూల్ విడుదల చేయాలా? అన్న నిర్ణయం కూడా అదే సమావేశంలో తేలనుంది.