LOADING...
#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?
మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కేబినెట్‌'లో ఇటీవల 'బాధ్యత రాహిత్యం' పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గణనీయంగా వినిపిస్తోంది. కొంతమంది మంత్రులు అసలు అజెండా కన్నా సొంత అజెండాలను ఎక్కువైపోయాయని, నోరు అదుపులో పెట్టుకోలేక కంట్రోల్‌ తప్పడం వల్లే సమస్యలు పెరుగుతున్నట్టు కేబినెట్‌ సహచరులే మాట్లాడుకుంటున్నారట. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే... అది రిపీట్ అవకుండా చూసుకోవడమన్నది సహజం.. కానీ ఇక్కడ మాత్రం కొందరు మంత్రులు సమస్యలను ఎదుర్కొంటున్నా... మిగతా వాళ్ళు వాటిని చూసి కూడా అలర్ట్‌ అవడం లేదట. ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్నా, మంత్రుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని కాంగ్రెస్‌ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

వివరాలు 

కొండా సురేఖ, పొన్నం, అడ్లూరి వివాదం 

ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. తాజాగా పొన్నం,అడ్లూరి ఎపిసోడ్. ఈ వివాదం కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రారంభమై, ఇప్పుడు పొన్నం వరకు చేరింది. అప్పట్లో కొండా చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కేసు వరకు వెళ్ళాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తే కేసులు ఎదురవ్వవచ్చు కానీ... సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు నాలుక కరుచుకోవడంతోపాటు పీకలు తెంచుకునే వరకు వస్తోందంటున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఉద్దేశించి ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత పొన్నం కార్యాలయం నుంచి నేను అట్లూరి లక్ష్మణ్‌ని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదంటూ ప్రకటన వచ్చింది.

వివరాలు 

వీడియో ద్వారా స్పందించిన అడ్లూరి లక్ష్మణ్

అయితే ఈ ఎపిసోడ్ ముగిసిందని భావించిన సమయంలో... మంత్రి శ్రీధర్ బాబు, మీడియా చిట్ చాట్‌లో పొన్నం వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ క్రమంలోనే... మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక వీడియో ద్వారా స్పందించారు. దళిత నేతలంటే గౌరవం లేదంటూ రియాక్ట్ అయ్యారు. క్షమాపణ చెప్తారనుకుంటే...ఇప్పటివరకు స్పందించలేదంటూ వీడియోలో పేర్కొన్నారు అడ్లూరి. ఆ ప్రెస్‌మీట్‌లోనే ఉన్న మంత్రి వివేక్‌ తమ వర్గానికి చెందిన మంత్రే అయిన కనీసం స్పందించక పోవడం ఏంటంటూ ఆయనకు కూడా తప్పుపట్టారు. ఇక , ఈ వివాదం చేయి దాటిపోతోందని గమనించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ రంగంలోకి దిగారు. అయితే,జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు,బీసీ రిజర్వేషన్ వంటి ప్రధాన సమస్యల సమయంలో ఇలాంటి అంతర్గత వివాదాలు పార్టీకి ప్రాణాంతకం అవుతున్నాయి.

వివరాలు 

ప్రతిపక్ష విమర్శలు, పార్టీలో అసహనం 

కొంతమంది సీనియర్ నేతలు మంత్రుల నోటిని అదుపులో ఉంచకపోవడం వల్ల పార్టీ కూడా ఇబ్బందుల్లో పడుతోందని చెబుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు ఇలాంటి రచ్చ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ మొత్తం సంఘటనలను సీఎం రేవంత్‌ రెడ్డి సవివరంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో "స్వేచ్ఛ ఎక్కువ" అనే పేరుతో కొందరు మంత్రులు తాము అనుకున్న విధంగా మాటలు చెప్పడం, పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితులు పార్టీ కౌంటర్‌ స్ట్రాటజీని బలహీనం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.