Page Loader
Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు
పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు

Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 08, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో గత సర్కారు హయాంలో నియమితులైన విద్యుత్ సంస్థల సీఎండీలు, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసగా తమ పదవులకు గుడ్ బై చెబుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL CMD) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సీఎండీ పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చారు.

DETAILS

వరుస రాజీనామాల్లో వారు కూడా

ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే ట్రాన్స్‌కో, జెన్‌కో CMD ప్రభాకర్‌ రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా ఆ కోవలోకి గోపాల్‌రావు చేరిపోయారు. మరోవైపు తెలంగాణ ఏఏజీ (AAG) Additional Advocate General జే.రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన AG-Advocate General బీఎస్ ప్రసాద్ సైతం ఇవాళో రేపో పదవి నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది వివిధ కార్పోరేషన్ ఛైర్మన్లు తమ రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారికి పంపించేశారు. గత సర్కారు హయాంలో బాధ్యతల్లో ఉన్న వారు ప్రస్తుతం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.