LOADING...
National Awards: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పంచాయతీలు: మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు
మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు

National Awards: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పంచాయతీలు: మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలనలో తెలంగాణ పంచాయతీలు మరోసారి దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మక 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు' ఈసారి తెలంగాణలోని రెండు గ్రామ పంచాయతీలకు లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని కోటేపల్లి మండల పరిధిలో ఉన్న మోతుకుపల్లి గ్రామ పంచాయతీ "గుడ్ గవర్నెన్స్" విభాగంలో జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అదే విధంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలానికి చెందిన ఫసల్వాడి గ్రామ పంచాయతీ "విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ" కేటగిరీలో అత్యుత్తమ పురస్కారాన్ని సాధించి రాష్ట్రానికి మరింత ప్రతిష్ట తెచ్చింది.

వివరాలు 

సీతక్క ఆనందం

గ్రామస్థాయిలో పారదర్శక పరిపాలనను సమర్థంగా అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం, భద్రత,సంక్షేమ పథకాల అమలులో చూపిన కృషి ఈ అవార్డులకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ పంచాయతీలు గ్రామ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తూ ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇలాంటి గొప్ప విజయంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా శక్తివికాసం దిశగా తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డులు స్పష్టమైన నిదర్శనమని ఆమె తెలిపారు.

వివరాలు 

మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామస్థులందరికీ అభినందనలు: సీతక్క 

ఈ విజయాన్ని సాధించిన మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సిబ్బంది,గ్రామస్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇటువంటి విజయాలు రాష్ట్రంలోని ఇతర పంచాయతీలకు ప్రేరణగా మారి, మరిన్ని గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement