LOADING...
Police: సైబరాబాద్‌,రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్స్ హ్యాక్ 
సైబరాబాద్‌,రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్స్ హ్యాక్

Police: సైబరాబాద్‌,రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్స్ హ్యాక్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా ఏకంగా పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్లే హ్యాకర్ల చేతికి చిక్కాయి. ముఖ్యంగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లు పది రోజులుగా పూర్తిగా పనిచేయడం లేదు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ ఘటన జరిగిన తరుణంలోనే ఇప్పుడు పోలీస్ విభాగానికి చెందిన వెబ్‌సైట్లను కూడా కేటుగాళ్లు టార్గెట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. వెబ్‌సైట్‌లోని లింక్‌లను ఓపెన్ చేస్తే సంబంధం లేని ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనితో వెంటనే ఐటీ విభాగం సర్వర్లను నిలిపివేసింది. వెబ్‌సైట్లు పనిచేయకపోవడంతో ప్రజలకు అవసరమైన సమాచారం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వివరాలు 

తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ హ్యాక్ 

ఈ రెండు పోలీస్ వెబ్‌సైట్లతో పాటు ప్రభుత్వంలోని మరికొన్ని కీలక వెబ్‌సైట్ల నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)చూస్తోంది. హ్యాకింగ్ వెనుక ఉన్న ముఠాలపై దర్యాప్తు చేపట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి NIC బృందం సమన్వయంతో పని చేస్తోంది. ఇదిలా ఉండగా,ఇటీవల తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. కోర్టు ఆదేశాల కాపీలు డౌన్‌లోడ్ చేసే సమయంలో పీడీఎఫ్ ఫైళ్లకు బదులుగా ప్రత్యక్షంగా ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుండటంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు."పీడీఎఫ్ ఫైల్స్ డౌన్‌లోడ్ అవకుండా,BDG SLOT అనే బెట్టింగ్ సైట్‌గా రీడైరెక్ట్ అవుతోంది"అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాలు 

సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళన

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గత నెల 11వ తేదీన ఈ హ్యాకింగ్ ఘటన చోటుచేసుకోగా, అదే రోజే హైకోర్టు రిజిస్ట్రార్ అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఏర్పడిన సమస్యను సాంకేతికంగా పరిష్కరించినట్లు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అంత కీలకమైన వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకోవడం సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Advertisement