Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే..
EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్స్ ప్రారంభం కానుండగా, అసలు ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. పోలింగ్(polling) ప్రశాంతంగా జరిగేందుకు 50 కంపెనీల తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తు కోసం మోహరించారు. ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ(Telangana)లో మొత్తం 3 కోట్ల 26 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
పోలింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్
పోలింగ్ సిబ్బంది బుధవారమే పోలింగ్ స్టేషన్(polling station)లకు వెళ్లనున్నారు. సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎన్నికల సామగ్రి తీసుకొని ఉద్యోగులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. పోలింగ్ సిబ్బంది, సామగ్రి వెళ్లే వాహనాలకు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను ఈసీ(EC) సిద్ధం చేసింది. నిర్దేశించిన రూట్లలో వాహనాలను వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసారు.
13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
మాక్ పోలింగ్ గురువారం ఉదయం 5:30గంటలకు జరుగుంది. అయితే అభ్యర్థుల ఏజెంట్లు ఆ సమయానికే పోలింగ్ కేంద్రంలోని ఉండాలని ఈసీ(EC) ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను ముట్టుకోవడానికి అనుమతి లేదు. నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలు 13 ఉండగా.. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5గంటలవరకు క్యూలో ఉన్న వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. ఈవీఎంలలో లోపాలను పరిష్కరించడానికి ECIL ఇంజనీర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ(EC) అందుబాటులో ఉంచుతోంది. అలాగే అదనంగా విడి ఈవీఎంలు కూడా తక్షణమే అందుబాటులో ఉండేలా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
28వేల మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు
తెలంగాణా పోలింగ్‌లో తొలిసారిగా అనేక అంశాల్లో ప్రత్యేకతలు కనిపించబోతున్నాయి. దాదాపు 28వేల మంది ఓటర్లు ఇప్పటికే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందువల్ల ప్రతి పోలింగ్ స్టేషన్‌లో, కొన్ని నియోజకవర్గాల్లో డబుల్ ఈవీఎం యూనిట్‌లు అవసరం అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే మూడు ఈవీఎం యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈసారి ఎన్నికల్లో మోడల్ పోలింగ్ స్టేషన్‌లను కూడా పెంచారు. మహిళా ఓటర్లు, దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌లకు వచ్చేలా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగులతో నిర్వహించే పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలకు అనుమతి లేదు
పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దివ్యాంగుల ఓటు వేసేందుకు వీలుగా 21 ,686 వీల్‌ఛైర్లు ఎన్నికల సంఘం(Election Commission) ఏర్పాటు చేసింది. అంతేకాదు, 80ఏళ్లు పైబడిన వారికి ఈసీ ఉచిత రవాణా సదుపాయాన్ని అందిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 644మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అలాగే ఓటర్లు ఓటరు స్లిప్‌లతో గుర్తింపు కార్డులను కూడా వెంట తీసుకొని రావాలని ఈసీ చెప్పింది. ఈ మేరకు ఈసీ 12 రకాల ఐడీలను ఈసీ సూచించింది. ఓటరు స్లిప్పులపై ఏదైనా గుర్తులు ఉంటే, పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రంలోకి ఫోన్లు తీసుకురావద్దని, ఓటు వేసినప్పుడు సెల్ఫీలు తీసుకోవడానికి అనుమతి లేదని పేర్కొంది.