Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ఇక జూన్ 11,12 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు,ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 12 తర్వాత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ వర్షాల ప్రభావం కనిపించనుంది. నగరం, పరిసర ప్రాంతాల్లో రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది.
వివరాలు
జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు
అదే సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ నివేదిక ప్రకారం, నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లోనే నిలిచిపోయే అవకాశం ఉంది. కనీసం జూన్ 17 వరకు అవి ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు పెద్దగా ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు. అలాగే జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల చురుకుదనం పెరిగి, వర్షాల తీవ్రత కూడా అధికమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.