Telangana: ఆర్టీసీకి ఐ-ఎలర్ట్ ఆదాయం.. ఇప్పటివరకు రూ.36 కోట్ల డీజిల్ పొదుపు
ఈ వార్తాకథనం ఏంటి
డీజిల్ ఖర్చు తగ్గించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఐ-ఎలర్ట్ సాంకేతికత మంచి ఫలితాలను ఇస్తోంది. బస్సుల ఇంధన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు డ్రైవర్ల డ్రైవింగ్ విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బీఎస్-6 బస్సుల్లో ఐ-ఎలర్ట్ సాంకేతికతను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వెల్లడించింది. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్‌ను ఆదా చేసినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ప్రతి నెలా దాదాపు రూ.2 కోట్ల విలువైన డీజిల్ ఆదా అవుతోందని పేర్కొంది.
వివరాలు
డ్రైవర్ల డ్రైవింగ్ తీరును నిరంతరం గమనించే ఐ-ఎలర్ట్
ప్రయాణికుల రవాణా కోసం వినియోగిస్తున్న 1,500 అశోక్ లేలాండ్ బీఎస్-6 బస్సులకు ఐ-ఎలర్ట్ పరికరాలను అమర్చినట్లు ఆర్టీసీ వివరించింది.
ఈ పరికరాలు డ్రైవర్ల డ్రైవింగ్ తీరును నిరంతరం గమనిస్తూ ఉంటాయి.
గేర్ల వినియోగం, ఇంజిన్ ఆర్‌పీఎం, బస్సు వేగం, బ్రేకులు ఉపయోగించే విధానం, అవసరం లేకపోయినా ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచడం వంటి అంశాలను నమోదు చేస్తాయి.
బస్సులను నిర్ణయించిన గ్రీన్ బ్యాండ్ ఆర్‌పీఎం పరిధిలో నడపడం, ఇంధన పొదుపునకు అనుకూలమైన ఎకానమీ గేర్లను సరిగ్గా ఉపయోగించడం వంటి విషయాలపై డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తాయి.
వివరాలు
రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల డీజిల్ ఆదా
అంతేకాకుండా డ్రైవర్ల డ్యూటీ పూర్తయిన తర్వాత వారి పనితీరును విశ్లేషించి గ్రేడింగ్ కూడా ఇస్తాయి.
ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల డీజిల్ ఆదా అవుతోందని ఆర్టీసీ తెలిపింది.
ఇంధన వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతున్నాయని పేర్కొంది.
ఐ-ఎలర్ట్ విధానం పనితీరుపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించింది.