Page Loader
Telangana: ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్‌ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు
ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్‌ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

Telangana: ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్‌ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో,ఈ పరిస్థితిని మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉన్న మౌలిక భాషా,గణిత నైపుణ్యాల అభివృద్ధి (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ-ఎఫ్‌ఎల్‌ఎన్‌),అలాగే అభ్యసన పురోగతి పెంపు కోసం అమలు చేస్తున్న లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (లిప్‌)ల అమలుపై శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ దిశగా,పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి,సంబంధిత వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలనే దిశగా కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు,విభాగాధిపతులు,అదనపు సంచాలకులు,సంయుక్త సంచాలకులు,ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు పని చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈ.వి. నరసింహారెడ్డి తాజా ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

తరగతి గదిలో కూర్చొని ప్రత్యక్షంగా బోధన పరిశీలన 

పర్యవేక్షకులు పాఠశాలలు సందర్శించినప్పుడు, ఒక్కో పాఠశాలలో కనీసం మూడు గంటలు గడిపి, ఒక తరగతిలో పూర్తి పీరియడ్ అయిన 45 నిమిషాలు కూర్చొని ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించాలి. అనంతరం సంబంధిత ఉపాధ్యాయుడికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అలాగే, అక్కడి సిబ్బందితో సమావేశం నిర్వహించి, ఈ వివరాలను విద్యా కరదీపిక (అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్ - ఏజీఆర్‌)లో నమోదు చేయాలి. సందర్శనకు సంబంధించిన ఫోటోలు సహా వివరాలను 'తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్'లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

వివరాలు 

ప్రతి నెల సమావేశాలు.. సమగ్ర సమీక్షలు 

పాఠశాలల్లో నెల రోజులపాటు జరిగిన సందర్శనల అనంతరం ప్రతి నెలా 28వ తేదీన జిల్లా విద్యాధికారి (డీఈవో)ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు పాల్గొని తరగతుల పరిశీలన, విద్యార్థుల అభ్యసన ప్రగతిపై చర్చించాలి. ఆ తరువాత రోజు అంటే ప్రతి నెలా 29న రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఆధ్వర్యంలో విభాగాధిపతులు, అదనపు సంచాలకులు, డీఈవోలు, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్‌సీఈఆర్‌టీ నిపుణులు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొని సమీక్ష నిర్వహించాలి. రాష్ట్రం, జిల్లాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ విభాగాలను ఏర్పాటు చేయాలని, వాటి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగాలని స్పష్టం చేశారు.

వివరాలు 

తొమ్మిది తరగతుల దాకా విద్యార్థులకు వార్షికంగా మూడు పరీక్షలు 

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎఫ్‌ఎల్‌ఎన్, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు లిప్‌ కార్యక్రమం అమలవుతున్న నేపథ్యంలో, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏడాదిలో మూడు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. బేస్‌లైన్ పరీక్ష: జూన్ 25 నుంచి 30వ తేదీల మధ్య నిర్వహించాలి. ఫలితాలను జులై 15 లోపు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలి. మిడ్‌లైన్ పరీక్ష: నవంబర్ 25-30 మధ్య జరగాలి. ఎండ్‌లైన్ పరీక్ష: మార్చి 5 నుంచి 7వ తేదీల మధ్య నిర్వహించాలి. ఫలితాలను మార్చి 30లోపు యాప్‌లో నమోదు చేయాలి. ఈ పరీక్షల ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ సిద్ధం చేసి పంపిస్తుంది.

వివరాలు 

ఏఐ ఆధారిత బోధనకు 80 నిమిషాలు 

గత విద్యా సంవత్సరం చివరినుంచి కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ (AI) ఆధారంగా గణితం, తెలుగు, ఆంగ్ల విషయాల్లో బోధన మొదలైంది. ఈ తరగతులకు ప్రతివారం రెండు సార్లు 80 నిమిషాల సమయం కేటాయించాలని నిర్ణయించారు.