Freight Corridor: కీలక దశకు ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సరుకు రవాణాలో కీలకంగా భావిస్తున్న ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (నార్త్-సౌత్ డీఎఫ్‌సీ) ప్రాజెక్టు ప్రస్తుతం కీలక దశకు చేరింది. సుమారు 922 కిలోమీటర్ల పొడవుతో, తెలంగాణ మీదుగా ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) రైల్వే బోర్డుకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదిక బోర్డు పరిశీలనలో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
రవాణా ఖర్చులపై భారీ ప్రభావం
మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి, తెలంగాణ గుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయాలని డీఎఫ్‌సీసీఐఎల్ ప్రతిపాదించింది. ఈ మార్గం అమలులోకి వస్తే, ఉత్తర-దక్షిణ భారత రాష్ట్రాల్ని కలిపే ప్రధాన సరకు రవాణా లింక్‌గా మారనుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లపై ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లు రెండూ నడుస్తుండటంతో, అదనపు రైళ్లను ప్రవేశపెట్టడంలోనూ, వేగం పెంచడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త కారిడార్ ద్వారా గూడ్సు రైళ్లకు ప్రత్యేక ట్రాక్ లభించనుంది. దీంతో సరుకు రవాణా సమయం తగ్గడమే కాకుండా, ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ఇదే సమయంలో ప్రయాణికుల రైళ్ల వేగం పెరగనుంది.
వివరాలు
కీలకం కానున్న తెలంగాణ
ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుండటంతో, సరుకు రవాణాలో రాష్ట్రానికి కీలక పాత్ర దక్కనుంది. దీని వల్ల పారిశ్రామిక క్లస్టర్లు, గిడ్డంగులు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్‌ల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. రహదారులపై భారీ ట్రక్కుల రద్దీ తగ్గడంతో పాటు, రైల్వే ఆధారిత గ్రీన్ లాజిస్టిక్స్‌కు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం ఇటార్సీ-విజయవాడ రైలుమార్గం సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, ఖమ్మం మీదుగా కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌కు సంబంధించిన ఎలైన్‌మెంట్ వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సరుకు రవాణా మార్గం కావడంతో, పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంగా ఈ లైన్ ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
వివరాలు
ఆధునిక సాంకేతిక వ్యవస్థలు
ఈ ప్రత్యేక కారిడార్‌ను భారీ స్థాయిలో సరుకుల రవాణాకు అనువుగా తీర్చిదిద్దాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఎక్కువ సంఖ్యలో వ్యాగన్లతో కూడిన గూడ్సు రైళ్లు నిరంతరంగా నడిచేలా ట్రాక్ సామర్థ్యం,విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, రైళ్ల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే డిజిటల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత, కేంద్ర క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి దశలు కొనసాగనున్నాయి.
వివరాలు
ఈస్ట్‌కోస్ట్ కారిడార్ విస్తరణ
ఇదిలా ఉండగా, ఇప్పటికే ప్రకటించిన ఖరగ్‌పుర్-విజయవాడ ఈస్ట్‌కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ను నిడుబ్రోలు వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ నుంచి నిడుబ్రోలు స్టేషన్ వరకు దూరం సుమారు 63 కిలోమీటర్లు కాగా, ఈ విస్తరణతో ఈ కారిడార్ మొత్తం పొడవు 1,149 కిలోమీటర్లకు చేరనుంది.