LOADING...
Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి
2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి

Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ దిగుమతి-ఎగుమతి వార్షిక వాణిజ్య విశ్లేషణ వేదికలో నమోదైన గణాంకాల ప్రకారం 2023-24 నుండి 2024-25 మధ్య కాలంలో తెలంగాణ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లో 117.9 శాతం వృద్ధిని నమోదు చేసి నాలుగో స్థానాన్ని సంపాదించింది. విమాన భాగాలు, రక్షణ పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన యంత్రాల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన పెరుగుదల సాధించింది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

తెలంగాణ అత్యున్నత స్థాయి వృద్ధి నమోదు

2022-23లో 1,827 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2024-25 నాటికి 7,536 మిలియన్ డాలర్లకు పెరిగి 103 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును నమోదు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10 శాతానికి పరిమితమైనప్పటికీ తెలంగాణ మాత్రం అత్యున్నత స్థాయి వృద్ధిని నమోదు చేయడం ప్రభుత్వానికి ఉత్సాహాన్నిస్తోంది. రాష్ట్ర మొత్తం సరుకు ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 38.44 శాతానికి చేరుకోవడం రాష్ట్ర ఎగుమతి రంగంలో పెద్ద మార్పుకు సంకేతంగా మారింది. రాబోయే 2025-26 సంవత్సరంతో పాటు తదుపరి పది సంవత్సరాల్లో కూడా ఇదే స్థాయి వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

విడిభాగాల తయారీలో తెలంగాణ ప్రధాన కేంద్రం 

ఈ వృద్ధికి ప్రధాన కారణంగా విమాన,రక్షణ రంగాల్లో ఉత్పత్తి విస్తరణ కీలక పాత్ర పోషించిందని కేంద్ర వాణిజ్య గణాంక విభాగం వెల్లడించింది. హైదరాబాద్‌లో పలు అంతర్జాతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో విడిభాగాల తయారీలో తెలంగాణ ప్రధాన కేంద్రమైంది. దీని ఫలితంగా 2023-24లో ఎనిమిదో స్థానంలో ఉన్న రాష్ట్రం.. కేవలం ఏడాదిలోనే నాలుగో అతిపెద్ద ఇంజినీరింగ్ ఎగుమతి రాష్ట్రంగా ఎదిగింది.

Advertisement

వివరాలు 

భవిష్యత్తులో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అనుకూల వాతావరణం

ఇక పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం భవిష్యత్ నగర నిర్మాణంపై దృష్టి సారించింది. పరిశ్రమల కోసం విస్తృత స్థాయిలో భూములను సమకూరుస్తూ ముందుకు సాగుతోంది. సేవా రంగం, తయారీ రంగం, వ్యవసాయ ఆధారిత రంగాలుగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement