తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు. అక్కడికక్కడే కూలీలు నాణేలను సమానంగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ కనకయ్య, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. కొన్ని నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు, మిగిలిన నాణేలను ప్రభుత్వానికి అందజేయాలని కూలీలను కోరారు. 1869 నుంచి 1911 వరకు చలామణిలో ఉన్నట్లు తెలిపిన ఈ నాణేలను ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఆర్ ఐ అనిల్ పరిశీలించారు.