LOADING...
Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం
రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం

Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వచ్చే వానాకాలం నుంచి "తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం"ను అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకం ద్వారా రైతులందరికీ ఉచితంగా బీమా వర్తింపజేయడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడం, నష్టపరిహారం క్లెయిమ్‌లను వేగంగా,పారదర్శకంగా పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం భరించే విధంగా కొత్త పథకాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది.

వివరాలు 

లోపాలు దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రతిపాదన

రాష్ట్రంలో 2015-16 నుంచి 2018-19 వరకు అమలైన పాత బీమా పథకం అధిక వ్యయం, క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం, పరిపాలన సమస్యలు, రైతులకు సరైన లాభం లేకపోవడం వంటి కారణాలతో నిలిపివేయబడింది. తరువాత ప్రభుత్వం మళ్లీ పథకంలో చేరినా అమలు జరగలేదు. ఈ నేపథ్యంలో లోపరహితమైన కొత్త విధానాన్ని రూపొందించేందుకు విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించగా, నిపుణుల బృందం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న పద్ధతులను పరిశీలించి ఈ నివేదికను రూపొందించింది.

వివరాలు 

ఖర్చు తగ్గింపు - మెరుగైన అమలు

పాత పథకం ప్రకారం కోట్ల ఎకరాలకు భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి వస్తుండగా, కొత్త విధానంలో తక్కువ వ్యయంతోనే అమలు సాధ్యమని నివేదిక తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేస్తే ప్రైవేటు టెండర్ల అవసరం తగ్గి, తక్కువ ప్రీమియంతో సేవలు అందించవచ్చని సూచించింది. క్లెయిమ్‌లు చేయని ప్రీమియం మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేర్చే విధానం కూడా ఉండాలని పేర్కొంది.

Advertisement

వివరాలు 

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అమలు

ఈ పథకంలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రైతుల తరఫున మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి. భూమి ఉన్న రైతులందరికీ స్వయంచాలకంగా బీమా వర్తింపజేయాలి. కౌలుదారులు, భాగస్వామ్య రైతులకు స్థానిక అధికారుల ధృవీకరణతో అర్హత కల్పించాలి. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, వేరుసెనగ, మిర్చి, పెసర, శనగ, సోయాబీన్ వంటి పంటలను చేర్చాలని సూచించారు. పంట నష్టాలను అంచనా వేయడానికి సంప్రదాయ విధానాలతో పాటు ఉపగ్రహ సాంకేతికతను వినియోగించాలని తెలిపారు. మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వివరాల ప్రదర్శన వ్యవస్థ ద్వారా పారదర్శకతను పెంచాలని సూచించారు. నష్టపోయిన రైతులకు పరిహారం 30 నుంచి 45 రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

పథకం అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సీజన్‌లో సాంకేతిక తనిఖీలు నిర్వహించడం, అధిక నష్టాలున్న ప్రాంతాల్లో సామాజిక తనిఖీలు చేపట్టడం అవసరమని తెలిపారు. అలాగే రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సమగ్ర వ్యవసాయ వేదిక ద్వారా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement