Paraquat Herbicide: పారాక్వాట్ గడ్డిమందుపై రాష్ట్ర నిషేధం.. రైతుల భద్రతకి కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రమాదకర కలుపు నివారణ మందు 'పారాక్వాట్'పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యం,రైతుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మందును పూర్తిగా నిషేధిస్తూ బుధవారం జీవో నెంబర్ 24ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, రెండు నెలల పాటు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిషేధం ప్రకారం పారాక్వాట్,దాని ఫార్ములేషన్ల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు,వినియోగం అన్నీ పూర్తిగా నిలిపివేయబడతాయి. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్షతో పాటు కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం ఈ మందును 90 శాతం కంటే ఎక్కువ మంది రైతులు ఉపయోగిస్తున్నారు.
వివరాలు
మందు సేవించి ప్రాణాలు కోల్పోయిన 1,167 మంది
అయితే, ఈ మందు పిచికారీ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తడం, కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవించడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతేకాక, క్షణికావేశంలో లేదా ప్రమాదవశాత్తు ఈ మందు సేవించిన కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,167 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పారాక్వాట్ వాడకం పర్యావరణానికి కూడా హానికరమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా అమ్మకాలపై నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా, ఈ మందును దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవల శాసనసభలో తీర్మానం కూడా చేసింది.
వివరాలు
పారాక్వాట్ అమ్మకాలు లేదా వినియోగం కొనసాగిస్తే కఠిన చర్యలు
ఇప్పుడీ నిర్ణయంతో పారాక్వాట్‌పై పూర్తి నిషేధాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, రైతుల రక్షణ ముఖ్యమనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. పారాక్వాట్ అమ్మకాలు లేదా వినియోగం కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.