
Telangana: తెలంగాణలో స్కూళ్లలో యూ-సీటింగ్ విధానం ప్రారంభం… ఇకపై బ్యాక్‌బెంచర్స్ అనే మాట లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ చిత్రంలో స్కూల్‌లో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చుని ఉన్నారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచర్ కల్చర్ పూర్తిగా తొలగించేందుకు ఈ ప్రత్యేక సీటింగ్ పద్ధతిని తీసుకువచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూ ఆకారపు సీటింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. మలయాళ చిత్రం 'స్థానార్థి శ్రీకుట్టన్'లో కనిపించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని స్కూళ్లు ఈ సీటింగ్ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో బ్యాక్ బెంచ్ సాంప్రదాయానికి స్వస్తి చెప్పనున్నారు.
వివరాలు
విద్యను ప్రభావవంతంగా మార్చడమే లక్ష్యం
తరగతి గదుల్లో యూ ఆకారంలో బెంచీలు అమర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పద్ధతితో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 'తరగతి గదులను మరింత ఉత్సాహపూరితంగా, పరస్పర సంబంధాలను పెంపొందించేలా, విద్యను ప్రభావవంతంగా మార్చడమే మా లక్ష్యం. యూ-సీటింగ్ విధానం విద్యార్థులు కేవలం ఎలా కూర్చుంటారో కాకుండా, వారు ఎలా నేర్చుకుంటారు, ఎలా చురుకుగా పాల్గొంటారు, ఎలా అభివృద్ధి చెందుతారో కూడా చూపిస్తుంది' అని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
వివరాలు
బోర్డు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది
ఈ విధానంతో ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటాడు. ఉపాధ్యాయులు పిల్లల కళ్ళలోకి చూస్తూ వారంతా దృష్టి సారించి ఉన్నారా లేదా అనేది నేరుగా గమనించగలుగుతారు. తరగతి గదిలో సమానత్వానికి ఇది సంకేతంగా మారుతుంది. ఇకపై బ్యాక్‌బెంచర్ అనే పదమే ఉండదు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడి దగ్గరగా ఉంటాడు. బోర్డు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. విద్యార్థులు వారి శ్రద్ధను మరింత పెంచుకుంటారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణను బోధించగలుగుతారు. విద్యార్థుల మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది. ఇక ఉపాధ్యాయులు కష్టపడుతున్న విద్యార్థులను సులభంగా గుర్తించి, సరైన సమయంలో సహాయం చేయగలుగుతారు.
వివరాలు
ఈ విధానం వల్ల టీచర్లు విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడే అవకాశం
ఈవిధానంతో'నేను బ్యాక్ బెంచర్'అనే భావన ఎవరి మనసులోనూ రాకుండా చూడవచ్చు. యూ ఆకారపు సీటింగ్ కారణంగా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని దగ్గరగా గమనించగలుగుతారు. ప్రతీఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉపాధ్యాయులకు లభిస్తుంది. డిజిటల్ విద్యా పద్ధతులు ఇప్పటికే తరగతి గదిలో విద్యను మరింత అభివృద్ధి పరుస్తుండగా,యూ-సీటింగ్ విధానం విద్యార్థుల కోసం మరో కీలక మార్గాన్ని చూపిస్తోంది. ఈవిధానం వల్ల టీచర్లు విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడే అవకాశం పొందుతారు. ప్రతి విద్యార్థి ఏం చేస్తున్నాడో గమనించగలుగుతారు.వారి ఏకాగ్రతపై ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయవచ్చు. విద్యార్థుల మాటలు వినడంలో,వారికి మాట్లాడే అవకాశం కల్పించడంలో,చర్చలు జరిపించడంలో ఈ పద్ధతి ఉపకరిస్తుంది. గ్రూప్ చర్చలు సులభంగా జరపవచ్చు.విద్యార్థులు నేర్చుకోవడంలో మరింత ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఉంటాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.