Telangana: తెలంగాణలో మరో 3 వేల పాఠశాలల్లో యూకేజీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏడాది 1000 ప్రభుత్వ పాఠశాలల్లో 'పూర్వ ప్రాథమిక విద్య' పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో 2 వేల నుంచి 2,500 పాఠశాలల్లో కొత్తగా ఈ తరగతులను ప్రారంభించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. అయితే పాఠశాల విద్యాశాఖ మరింత ముందడుగు వేసి, రాష్ట్రవ్యాప్తంగా 2,700 నుంచి 3 వేల ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ప్రీ ప్రైమరీ అవసరం ఉన్న పాఠశాలలను గుర్తించి జాబితా పంపాలని జిల్లా విద్యాధికారులకు (డీఈఓలు) సూచించింది.
వివరాలు
6 వేల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 6 వేల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీ పరిధిలో కనీసం ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 1362 పాఠశాలల్లో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఆయాలు, ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. వారికి గౌరవ వేతనంగా ఆయాలకు నెలకు రూ.6 వేలూ, ఇన్‌స్ట్రక్టర్లకు రూ.8 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ ఖర్చులను సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద భరిస్తారు. ఇదిలా ఉండగా, ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా నర్సరీతో పాటు ఎల్‌కేజీ తరగతులను కూడా ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది.
వివరాలు
క్యూర్ పరిధిలో కూడా అమలు
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో కూడా ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల 28 ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే.