Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం
తెలంగాణలో మద్యంప్రియులు మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు. తాజాగా మద్యం అమ్మకాల్లో(Liquor Sales) తెలంగాణ రికార్డు సృష్టించింది. తాజాగా మద్యం అమ్మకాలు, వినియోగంపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. దక్షిణాధిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి తెలంగాణలో మద్యం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే పెరుగుతున్నట్లు సమాచారం.
ఆదాయంలోనూ తెలంగాణ మొదటిస్థానం
ఆంధ్రప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. 2022-23లో అక్కడ 3.35 కోట్ల లిక్కర్ (ఐఎంఎల్) కేసులు అమ్ముడుపోయాయి. దీనినిబట్టి అక్కడ తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. 1.16 కోట్ల కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ తలసరి మద్యం వినియోగం 9 లీటర్లుగా, బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. లిక్కర్ వినియోగంలోనే కాకుండా ఆదాయంలోనూ తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉంది. 2022-23లో తెలంగాణలో రూ.33,268 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.23,804 కోట్లు, కర్ణాటకలో రూ.29,790 కోట్లు, కేరళలో రూ. 16,189 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చింది.