LOADING...
Telangana : ఏప్రిల్‌ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌: సీఈవో
ఏప్రిల్‌ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌: సీఈవో

Telangana : ఏప్రిల్‌ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌: సీఈవో

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏప్రిల్‌-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ సర్వేను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక బీఎల్‌ఏ (బూత్‌ లెవల్‌ ఏజెంట్‌)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కచ్చితత్వం,పారదర్శకత, సమస్యల సత్వర పరిష్కారం కోసం బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్‌ కేంద్ర పరిధిలో నివసించే స్థానికులనే బీఎల్‌ఏలుగా నియమించుకోవాలని,వారు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు)తో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వివరాలు 

కొనసాగుతున్న 2025 ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చే మ్యాపింగ్‌ ప్రక్రియ

ఓటర్ల సర్వేకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సీఈవో వెల్లడించారు. 2025 ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చే మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించేందుకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేపడుతున్నారని తెలిపారు. సర్వే నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత సమయం చాలా పరిమితంగా ఉంటుందని, అందువల్ల రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సర్వే నిర్వహణ విధానాన్ని వివరిస్తూ, సన్నాహక దశలో పోలింగ్‌ కేంద్ర పరిధిలోని నివాస గృహాలను బీఎల్‌వోలు మూడు నుంచి నాలుగు సార్లు సందర్శిస్తారని తెలిపారు.

వివరాలు 

మొదటి దఫాలో జనగణన

మొదటి దఫాలో జనగణన చేపడతారని, అనంతరం అందుబాటులో లేని కుటుంబాలను మళ్లీ సందర్శిస్తారని చెప్పారు. ఈ సన్నాహక దశల్లో మ్యాపింగ్‌ పూర్తికాని ఓటర్లు, ఎస్‌ఐఆర్‌ సర్వే సమయంలో తమ వివరాలను సమర్పించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని, అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని సీఈవో సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈవో హరిసింగ్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement