
Telangana: తెలంగాణలోని ఈ ప్రాంతాలకుఎల్లో అలర్ట్ జారీ.. 4 రోజులు కుమ్మేయనున్న వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, అదనంగా క్యూములోనింబస్ మేఘాల ప్రభావం కూడా కనిపిస్తున్నందున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు
ములుగు,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,ఆసిఫాబాద్,ఆదిలాబాద్,పెద్దపల్లి,భూపాలపల్లి,కొత్తగూడెం, జనగామ,హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక మరోవైపు, నిన్న రాష్ట్రంలో దక్షిణ జిల్లాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు మెదక్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.