Telegram: టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ఈ వేదిక క్రమంగా 'కొత్త డార్క్ వెబ్'గా మారుతోందని, సైబర్ నేరగాళ్లు, అతివాద సంస్థలు, డ్రగ్స్ ముఠాలు, మోసగాళ్లు చట్టం కళ్లుగప్పి కార్యకలాపాలు సాగించేందుకు దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
వివరాలు
నీట్ రీటెస్ట్ వివాదం మధ్య కోర్టుకు కేంద్రం అఫిడవిట్
నీట్ రీటెస్ట్ నేపథ్యంలో దేశంలో టెలిగ్రామ్ వినియోగంపై కేంద్రం ఇటీవల తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా గురువారం కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో క్రిమినల్ నెట్‌వర్క్‌లు, సైబర్ నేరగాళ్లు, అతివాద ముఠాలు ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా టెలిగ్రామ్‌లోని అధునాతన గోప్యతా ఫీచర్లు నేరగాళ్లకు అనుకూలంగా మారాయని పేర్కొంది.
వివరాలు
గోప్యత ఫీచర్లతో నేరాలకు అండ
టెలిగ్రామ్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌ల కారణంగా యూజర్లు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలు, ఇతర గుర్తింపు వివరాలను దాచుకునే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. దీంతో అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టంగా మారుతోందని పేర్కొంది. ఈ ఫీచర్లను ఆసరాగా చేసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, ఉగ్రదాడులు, ఆర్థిక మోసాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నేరగాళ్లు పాల్పడుతున్నారని ఆరోపించింది. డార్క్ వెబ్ లింకుల ద్వారా పరస్పరం అనుసంధానం చేసుకుంటూ అధికారులకు చిక్కకుండా వ్యవహరిస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కారణంగానే టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్‌గా మారిందని కేంద్రం వ్యాఖ్యానించింది.
వివరాలు
ఉగ్రవాద ప్రచారం.. తప్పుడు సమాచారం
హింసాత్మక, తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రచారానికి టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్లు వేదికగా మారుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెంది శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. అలాగే పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, చిత్రాలు టెలిగ్రామ్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయని తెలిపింది. నకిలీ ఖాతాలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, టెలిగ్రామ్ దుర్వినియోగంపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఇటీవలి కాలంలో ఫిర్యాదులు పెరిగినట్లు వెల్లడించింది.
వివరాలు
హ్యాకింగ్, డేటా చౌర్యం, పైరసీపై ఆందోళన
హ్యాకర్ గ్రూపులు టెలిగ్రామ్ ఛానెళ్లను ఉపయోగించి భారీ స్థాయిలో డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. టెలిగ్రామ్‌లోని కొన్ని బాట్స్ ద్వారా మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా, పైరసీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్‌ను అక్రమంగా ప్రసారం చేయడానికి కూడా ఈ వేదికను ఉపయోగిస్తున్నారని కేంద్రం తెలిపింది.
వివరాలు
నీట్ రీటెస్ట్‌పై తప్పుడు ప్రచారం.. ఆంక్షలకు ఇదే కారణం
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జూన్ 21న రీటెస్ట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఠాలు టెలిగ్రామ్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై అపోహలు వ్యాప్తి చెందకుండా చూడటం,తప్పుడు వార్తలను అరికట్టడం, మోసపూరిత నెట్‌వర్క్‌లను నియంత్రించడం కోసం టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఆంక్షలు జూన్ 22 వరకు అమల్లో ఉంటాయని హైకోర్టుకు వెల్లడించింది.