
దిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
దిల్లీలో సోమవారం భారీ వడగాలులు వీస్తాయని దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలకు హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది.
ఇదిలా ఉంటే, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వచ్చే 3రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుతుందని వెల్లడించింది.
రాబోయే 5 రోజులలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఉండదని స్పష్టం చేసింది.
దిల్లీ
ఈ రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
అసోం, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర సహా రాష్ట్రాలతో పాటు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
హిమాలయ ప్రాంతం, ఉత్తరాఖండ్‌లో పిడుగులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
వచ్చే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కర్ణాటక, కేరళ, మాహేలతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.