Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత
ఈ వార్తాకథనం ఏంటి
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిస్తూ, త్వరలోనే ఈ భద్రత అమల్లోకి రానుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో, అలాగే ఆయన రాజకీయ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని ఆయన భద్రత కోసం నియమించనున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిన వారం రోజుల్లోనే ఈ స్థాయి భద్రత కల్పించడం విశేషంగా మారింది.
వివరాలు
మే4న ఫలితాలు
కోల్కతాలో జన్మించిన లియాండర్ పేస్, ప్రపంచ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడిగా ఖ్యాతి గడించారు. తన కెరీర్‌లో మొత్తం 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. అందులో 10 మిక్స్‌డ్ డబుల్స్‌లో, 8 పురుషుల డబుల్స్‌లో విజయం సాధించారు. రాజకీయంగా చూస్తే, ఆయన 2021లో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా, బెంగాల్‌లో ఎన్నికలు రెండు దశల్లో—ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల వేళ భద్రతా కారణాల దృష్ట్యా పేస్‌కు ఈ అదనపు రక్షణ కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.