SWISS: దిల్లీ ఎయిర్‌పోర్టులో టెన్షన్.. టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం జ్యూరిచ్కు బయల్దేరేందుకు సిద్ధమైంది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను అత్యవసరంగా బయటకు దించారు.
వివరాలు
విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులు
ఎమర్జెన్సీ స్లైడ్‌ల సహాయంతో ప్రయాణికులను కిందకు దించుతున్న సమయంలో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 232 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరికీ భద్రంగా బయటపడేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్లు, త్వరలోనే మరో విమానం ద్వారా వారి గమ్యస్థానాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.