Amit Shah: అమిత్ షా పర్యటనలో ఉద్రిక్తత.. ఐఈడీ పేలుడు, జవాన్‌కు గాయాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది కీలక సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)ను గుర్తించారు. నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనకు సంబంధించి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల సందర్భంగా పేలుడు పదార్థాలు కలిగివున్న తొమ్మిది మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులతో పాటు ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఘటన ప్రాంతంలో హైఅలర్ట్
ఈ ఘటన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం రాయ్‌పుర్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా రాయ్‌పుర్, బస్తర్ జిల్లాల్లో జరుగనున్న వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మావోయిస్టుల ముప్పు దృష్ట్యా అమిత్ షా పర్యటనకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.