మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు. వాస్తవానికి మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో సీఎం నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ శుక్రవారం జిమ్-కమ్-స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించాల్సి ఉంది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేయబడిన రక్షిత అడవులు, చిత్తడి నేలలపై చేసిన సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఒక ఆదివాసీ గిరిజన ఫోరమ్ సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టినట్లు సమాచారం. చాలా రోజులు ఆదివాసీ గిరిజన ఫోరమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేసిందని గిరిజన ఫోరం ఆరోపించింది.
చురచంద్‌పూర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
చురచంద్‌పూర్‌లో సీఎం ఈవెంట్ వేదికకు నిప్పు పెట్టిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. సెక్షన్ 144 విధించారు. ఆదివాసీ గిరిజన ఫోరమ్ సీఎం కార్యక్రమ వేదిక వద్ద ఉన్నట్లు కుర్చీలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా నిర్మించిన జిమ్‌లోని క్రీడా సామగ్రిని కూడా తగులబెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు హింసకు పాల్పడుతున్న గుంపును చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో చురచంద్‌పూర్ జిల్లాలో భద్రతను పోలీస్ శాఖ కట్టుదిట్టం చేసింది. చురచంద్‌పూర్‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హింస నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటుందా? రద్దయ్యిందా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఇంకా నిర్ధారించలేదు.