Air India: 'పాన్ పాన్' అలర్ట్‌తో ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత.. ప్రయాణికుల్లో భయాందోళన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలోనే విమానంలో పొగలు కనిపించడంతో పైలట్లు అప్రమత్తమై, అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని లక్నోకు మళ్లించారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఆక్సిజన్ మాస్కులు ఒక్కసారిగా కిందకు రావడంతో ప్రయాణికులు ఏమి జరుగుతోందో అర్థంకాక భయంతో వణికిపోయారు.
వివరాలు
అసలు ఘటన ఏంటి?
సోమవారం సాయంత్రం IX 1523 (ఐఎక్స్ 1523) విమానం 134 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బాగ్‌డోగ్రా నుంచి బయలుదేరింది. సాయంత్రం 4:58 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాపైగా ప్రయాణిస్తున్నప్పుడు, విమానంలోని ఏవియానిక్ ప్యానెల్ నుంచి పొగ వస్తోందని పైలట్లు గుర్తించారు. వెంటనే 'PAN PAN' కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసి, లక్నోలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.
వివరాలు
విమానంలో గందరగోళం
అత్యవసర ల్యాండింగ్ ప్రకటన వెలువడగానే ఆక్సిజన్ మాస్కులు కిందకు పడటంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. అయితే విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి, మాస్కులను ఎలా ఉపయోగించాలో సూచిస్తూ, ప్రయాణికులను శాంతింపజేశారు. సాయంత్రం 5:17 గంటలకు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
వివరాలు
తనిఖీల్లో తేలింది
ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను టెర్మినల్-3కు తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, సాంకేతిక నిపుణులు విమానాన్ని పూర్తిగా పరిశీలించారు. అయితే ఎక్కడా పొగ లేదా మంటల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్తగా విమానాన్ని మళ్లించామని తెలిపారు. అనంతరం ప్రయాణికులను కొంత విరామం తర్వాత ప్రత్యామ్నాయ విమానాల్లో ఢిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక లోపంపై దర్యాప్తు కొనసాగుతోంది.