Flight: గాల్లో భయానక క్షణాలు.. విమానం కుదుపులతో ఏడ్చిన ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహభరితమైన అనుభవమే. అయితే గాల్లో ఉండగా అనుకోని పరిస్థితులు ఎదురైతే అది భయానకంగా మారుతుంది. అచ్చం అలాంటి సంఘటనే ఒక విమాన ప్రయాణంలో చోటుచేసుకుంది. గగనతలంలో ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు భయంతో అరుస్తూ, ఏడుస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయలుదేరింది. హుబ్లీకి చేరువవుతున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో విమానం గాల్లో ఉండగానే తీవ్ర కుదుపులకు లోనైంది.
వివరాలు
కేకలు పెట్టి, కన్నీళ్లు పెట్టుకున్న ప్రయాణికులు
ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కొందరు సీట్లను గట్టిగా పట్టుకోగా, మరికొందరు కేకలు వేస్తూ, ఇంకొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో విమానం దాదాపు నాలుగు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి పైలట్లు విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం దిగిన వెంటనే ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటూ బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా దిగినప్పటికీ, ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు స్పష్టంగా కనిపించాయి.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం ఈ విమానం ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. సాయంత్రం 4:30 గంటలకు హుబ్లీకి చేరుకోవాల్సి ఉండగా, గమ్యస్థానానికి దగ్గరలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు ల్యాండింగ్ ప్రణాళికను మార్చుకోవాల్సి వచ్చింది.