Delhi: దిల్లీకి ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల అత్యవసర హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధానిలో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా దిల్లీలోని ఎర్రకోట, అలాగే చాందినీ చౌక్ ప్రాంతంలోని ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ) ప్రణాళిక రచించినట్లు సమాచారం అందిందని తెలిపాయి. ఇందుకోసం భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశమున్నట్లు సూచించాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Details
అప్రమత్తమైన అధికారులు
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సంస్థలు దిల్లీలో హై అలర్ట్ ప్రకటించాయి. సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించగా, బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమాచారమివ్వాలని పోలీసులు స్థానికులను కోరారు. గత ఏడాది ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి సంఘటనను దృష్టిలో ఉంచుకుని, తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. దిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.