PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం అన్ని దేశాలకు పెను భూతంలా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉగ్రవాదం అంతం కోసం పలు దేశాలు ఉమ్మడి పోరుకు కార్యచరణ దిశగా కదలకపోవడం బాధాకరమన్నారు. దిల్లీలోని G-20 పార్లమెంటరీ సమ్మిట్ ని శుక్రవారం మోదీ ప్రారంభించారు. అనంతరం పార్లమెంట్‌పై ఉగ్రవాదులు 2001లో దాడి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఉగ్రవాద ముప్పుతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అన్ని దేశాలు కలిసికట్టుగా, టెర్రరిజంపై పోరాటం కోసం కలిసి రావట్లేదన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు సంయుక్తంగా పనిచేసే విధానం కావాలని, ఇందుకు అన్ని దేశాల పార్లమెంటుల్లో చర్చలు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్ స్లోగన్ తో సాగాలి : మోదీ
భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాదం సమస్యలతో ఎదురీదుతోందన్నారు. వేల సంఖ్యలో అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, దీనికి టెర్రరిస్టులే కారణమన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సమస్య సవాలుగా మారుతోందన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై, ఇజ్రాయెల్ - పాలస్థీనాల వైఖరి, ఘర్షణలపైనా నరేంద్ర మోదీ స్పందించారు. యుద్ధాలు, సంఘర్షణల ప్రయోజనాలు ఎవరికీ రావని, వాటితో ఆస్తి, ప్రాణ నష్టాలే ఎక్కువన్నారు. ఉగ్రవాదాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తాయన్నారు. అసలు సమస్యలు వదిలేసి కొత్తగా సమస్యలను పుట్టిస్తే ప్రపంచమే చీకటిమయంమవుతుందని హెచ్చరించారు. ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్ స్లోగన్ తో సాగాలని ఆయన ఆకాంక్షించారు. వీటి పరిష్కారం కోసం ప్రజల భాగస్వామ్యమే అసలైన పరిష్కారమన్నారు.