
Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.
పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో, భద్రతా దళాలు దానిపై స్పందించి ప్రాదేశికంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ దర్యాప్తులో భాగంగా నాదిర్ గ్రామంలో తనిఖీలు కొనసాగుతుండగా, ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు దిగారు.
ఈ ఎన్‌కౌంటర్ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.
జైషే మహ్మద్ ఉగ్రసంఘానికి చెందిన మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు కూడా ముట్టడిలో చిక్కినట్టు తెలుస్తోంది.
ఇటీవలి 48 గంటల వ్యవధిలో జమ్మూకశ్మీర్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్‌గా నమోదు అయింది.
మంగళవారం, షోపియాన్ జిల్లాలోని జిన్‌పాథర్ కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
వివరాలు
పహల్గాంలో ఘోరమైన ఉగ్రదాడి
వీరు లష్కరే తయ్యిబా ఉగ్రసంఘానికి చెందినవారని గుర్తించారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో పలు ఉగ్రచర్యల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా,ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఘోరమైన ఉగ్రదాడి చోటుచేసుకుంది.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చాలా దగ్గర నుండి కాల్పులు జరిపారు.ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం ఆ ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అప్పటి నుండి వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
ఈ దాడిలో ప్రమేయం ఉన్నారని అనుమానిస్తున్న ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల ఫొటోలు ఉన్న పోస్టర్లు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు.