TG TET 2024: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. నవంబరు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో వెల్లడించింది. ఈ ఏడాది మే 20 నుండి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్‌కు సంబంధించి నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పరీక్షలు ఉంటాయని ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో పేర్కొంది.
ఏడాదిలోనే రెండోసారి టెట్
టెట్ పేపర్-1కు డీఈడీ పూర్తిచేసిన వారు, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత అవసరమని ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా, రాబోయే జనవరిలో పదోసారి పరీక్ష జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మేలో నిర్వహించిన టెట్‌తో కలుపుకొని ఆరు సార్లు పరీక్షలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండోసారి టెట్ నిర్వహించడం విశేషం.