Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వరంగల్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి మొత్తం 255 బస్సులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హనుమకొండ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ప్రత్యేక బస్సుల ఛార్జీలను ఇప్పటికే ఖరారు చేశారు.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉండగా, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ విజయభాను విజ్ఞప్తి చేశారు.
వివరాలు
వేములవాడకు ప్రతి 15 నిమిషాలకు బస్సు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేసింది.
రాష్ట్రంలోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి డిపో నుంచి పదుల సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా, హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు వేములవాడకు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి ఆలయాలకు కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రధాన బస్సు మార్గాలు
హనుమకొండ బస్టాండ్ నుంచి భూపాలపల్లి డిపో ద్వారా కాళేశ్వరం వెళ్లేందుకు 30 బస్సులు,పరకాల డిపో నుంచి 20 బస్సులు,వరంగల్-2 డిపో నుంచి 4 బస్సులు అందుబాటులో ఉంటాయి.
మొత్తం 54 బస్సులు కాళేశ్వరం వెళ్లనున్నాయి.పాలకుర్తి ఆలయానికి వరంగల్ వన్ డిపో నుంచి 5 బస్సులు,తొర్రూరు డిపో నుంచి 14 బస్సులు నడిపి మొత్తం 19 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.
మహబూబాబాద్ డిపో నుంచి కురవికి 41 బస్సులు, జనగామ డిపో నుంచి కొమురవెల్లికి 50 బస్సులు, హనుమకొండ డిపో నుంచి మెట్టుగుట్టకు 2 బస్సులు, వరంగల్-2 డిపో నుంచి రామప్పకు 17 బస్సులు, పరకాల డిపో నుంచి ఒక బస్సు మొత్తం 18 బస్సులు రామప్ప ఆలయానికి నడిపేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
ప్రత్యేక బస్సుల ఛార్జీలు
ప్రయాణికుల సౌకర్యార్థం హనుమకొండ, వరంగల్, వేములవాడ, కాళేశ్వరం, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లి బస్ స్టేషన్లలో ఆర్టీసీ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.
ప్రయాణ ఖర్చులను ముందుగానే ఖరారు చేసి, భక్తులకు అందుబాటులో ఉంచారు.
బస్సు ఛార్జీల వివరాలు
హనుమకొండ → కాళేశ్వరం : రూ.250
హనుమకొండ → వేములవాడ : రూ.210
హనుమకొండ → రామప్ప : రూ.140
హనుమకొండ → పాలకుర్తి : రూ.90
వరంగల్ → మెట్టుగుట్ట : రూ.50
వరంగల్ → ఐనవోలు : రూ.50
మహబూబాబాద్ → కురవి : రూ.30
జనగామ → కొమురవెల్లి : రూ.100
తొర్రూరు → పాలకుర్తి : రూ.100
ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుని మహా శివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని, శివుని ఆశీస్సులు పొందాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఆకాంక్షించారు.