
Uddhav Thackeray: రాజకీయ శత్రుత్వాన్ని మరిచి కలిసిన ఠాక్రే సోదరులు.. 20 ఏళ్ల తర్వాత కలయిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్ధవ్ ఠాక్రే - రాజ్ ఠాక్రే సోదరులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒకే వేదికపై దర్శనమిచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఇటీవల వర్లిలో జరిగిన ఉమ్మడి నిరసన కార్యక్రమంలో ఈ ఇద్దరూ కలిసే కనిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇలా ఒకే వేదికపై కనిపించిన ఈ సోదరులు, తాజాగా మాతోశ్రీ వేదికగా మళ్లీ సమావేశమయ్యారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా రాజ్ ఠాక్రే ఆయన నివాసమైన మాతోశ్రీకి ఆదివారం తన అనుచరులతో కలిసి వచ్చారు. సోదరుడికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన రాజ్, అనంతరం బాలాసాహెబ్ ఠాక్రే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఉద్ధవ్-రాజ్ సోదరులు చిరునవ్వులతో పరస్పర కరచాలం చేసుకున్నారు.
Details
దయాదుల మధ్య సంబంధాలు మెరుగు అవుతున్నాయి
ఈ పరిణామం వల్ల ఠాక్రే కుటుంబంలో గతంలో ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని, దాయాదుల మధ్య సంబంధాలు మెరుగవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే చివరి రోజులైన 2012లో రాజ్ ఠాక్రే చివరిసారిగా మాతోశ్రీని అధికారికంగా సందర్శించారు. ఆ తర్వాత 2019లో తన కుమారుడు అమిత్ ఠాక్రే వివాహానికి ఉద్ధవ్ కుటుంబాన్ని ఆహ్వానించిన రాజ్, వేడుక ముగిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాతోశ్రీలో ఈ తాజా కలయిక 2005లో విడిపోయిన తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్శనలో రాజ్‌తో పాటు ఎంఎన్‌ఎస్ నేతలు బాల నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్ కూడా ఉన్నారు. 20 ఏళ్ల విరామానంతరం ఈ కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.