Air Pollution: హైదరాబాద్'ను వణికిస్తున్న వాయు కాలుష్యం!
దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే, అది హైదరాబాద్ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, విదేశాల నుండి కూడా చాలా మంది హైదరాబాద్‌ను తమ నివాసంగా ఎంచుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం ఈ మహానగరంలో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగించే స్థితికి చేరుకున్నాయి. ఇటీవల, హైదరాబాద్‌లో గాలి నాణ్యత స్థాయిలో తీవ్రమైన పతనం కనిపించింది. ముఖ్యంగా ఆదివారం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణనీయంగా పడిపోయింది.
శ్వాస సంబంధిత సమస్యలు
కూకట్‌పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది, ఇది దేశ రాజధాని ఢిల్లీతో సమానమైన గాలి కాలుష్య స్థాయిని సూచిస్తోంది. ఈ పరిణామాలు పర్యావరణవేత్తల్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. నగరంలో చిన్నారులు, వృద్ధులు, అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజల ఆరోగ్యంపై ఈ పరిస్థితులు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.