'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ
జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాని మోదీని ఉద్దేశించి దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తారు. లేఖలో ప్రధాని మోదీపై సిసోడియా విరుచుకపడ్డారు. భారతదేశం పురోగమించాలంటే చదువుకున్న ప్రధానమంత్రి కావాలన్నారు. సిసోడియా లేఖ కాపీని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సిసోడియా భావాలను ప్రతిధ్వనిస్తూ, చదువుకోని ప్రధానమంత్రిని కలిగి ఉండటం దేశానికి ప్రమాదకరం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మోదీకి సైన్స్ అర్థం కాదు: సిసోడియా
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన జైలు నుంచే ఈ లేఖ రాశారు. ప్రధానికి తక్కువ చదువు రావడం దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. మోదీకి సైన్స్ అర్థం కాదని, చదువు ప్రాధాన్యత తెలియదని సిసోడియా పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో 60వేల స్కూళ్లు మూతపడినట్లు లేఖలో ఆయన గుర్తు చేశారు. భారతదేశం పురోగమించాలంటే విద్యావంతులైన ప్రధానమంత్రి అవసరమని సిసోడియా నొక్కి చెప్పారు.