
అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఈ కోర్టుకు ఎటువంటి కారణం కనపడలేదని, అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేసినట్లు ధర్మాసనం వెల్లడించింది.
గతేడాది జూన్ 14న అగ్నిపథ్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. అనంతరం ఈ స్కీమ్‌పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అన్ని రాష్ట్రాల్లోని కోర్టులు, సుప్రీంకోర్టులో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కుప్పలు, తెప్పలుగా పిటిషన్లను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
అగ్నిపథ్
డిసెంబర్ 15న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
గతేడాది జూలైలో దిల్లీ హైకోర్టుకు పిటిషన్లను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. వెంటనే విచారణ ప్రారంభించిన హైకోర్టు అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడానికి బదులుగా ఈ అంశాన్ని వింటామని తెలిపింది.
ఈ క్రమంలో డిసెంబర్ 15న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. డిసెంబర్ 23లోపు తమ లిఖితపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని వాదులు, ప్రతివాదులను కోరింది.
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని సైన్యంలో రిక్రూట్‌మెంట్ అనేది ముఖ్యమైన సార్వభౌమ విధి అని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సైన్యంలోకి యువ రక్తాన్ని నింపడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఈ సందర్భంగా పేర్కొంది.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనల విన్న హైకోర్టు అగ్నిపథ్ పథకాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపింది.