దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అంతకు ముందు పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో అతను ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మద్యం వ్యాపారి, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఈడీ చార్జీషీట్‌లో పేర్కొంది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను విశ్వసించాలని ఈ సందర్భంగా సమీర్‌ను కేజ్రీవాల్ కోరినట్లు ఈడీ తెలిపింది.
రెండు చార్జీషీట్లు దాఖలు చేసి, 9మందిని అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్య కేసు చార్జీషీట్‌లో కేజ్రీవాల్ పేరును చేర్చిన కొద్దిరోజుల తర్వాత పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకు రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ, మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఈడీ అభియోగాలు మోపింది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బిభవ్ కుమార్ సహా 36 మంది నిందితులు 170 ఫోన్‌లను ధ్వంసం చేశారని ఈడీ ఛార్జీషీట్లో పేర్కొంది. వేల కోట్ల రూపాయల విలువైన 'కిక్‌బ్యాక్‌ల' సాక్ష్యాలను దాచిపెట్టడంపై బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.