దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. సాహిల్ తన ప్రియురాలైన నిక్కీని ఫిబ్రవరి 9న రాత్రి హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదేరోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 14న ఈవిషయం వెలుగులోకి వచ్చింది. నిక్కీని పెళ్లి చేసుకోవడం సాహిల్ కుటుంబ సభ్యులకు ఇష్టంలేదు. ఈక్రమంలో 2022లో మరో అమ్మాయితో పెళ్లి చేయాలని సాహిల్ కుటుంబసభ్యులు నిర్ణయించారు. సాహిల్‌తో పెళ్లి జరిగిన విషయాన్ని నిక్కీ కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టారు.
సాహిల్ తండ్రిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు
నిక్కీ హత్యలో సాహిల్‌కు సహాయం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. సాహిల్ స్నేహితులు, కుటుంబ సభ్యులు నిక్కీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సాహిల్ తండ్రి వీరేందర్‌సింగ్, అతని ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న సాహిల్ నేరాన్ని అంగీకరించాడు. ఫిబ్రవరి 10న తనకు పెళ్లి జరగనుందని నిక్కీకి తెలియడంతో సాహిల్‌ను నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సాహిల్ తన కారులో ఉంచిన డేటా కేబుల్‌తో నిక్కీ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె ఫోన్‌లోని తనకు సంబంధించిన డేటాను తొలగించాడు.