Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించన హర్యానా విభాగాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే ఎన్‌హెచ్-48లో దిల్లీ, గురుగ్రామ్ మధ్య రద్దీ తగ్గనుంది. ఎనిమిది లేన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్‌ను సుమారు రూ. 4,100 కోట్లతో నిర్మించారు. ఈ రహదారి ఇందిరాగాంధీ విమానాశ్రయం, గురుగ్రామ్ బైపాస్‌కు నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది.
ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి హైవే కూడా..
అలాగే, ప్రధాని మోదీ ప్రారంభించబోయే ఇతర ప్రాజెక్టుల్లో నాంగ్లోయ్-నజఫ్‌గఢ్ రోడ్ నుంచి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారక సెక్షన్ వరకు 9.6 కి.మీ పొడవైన ఆరు-లేన్ అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సుమారు రూ.4,600 కోట్లతో అభివృద్ధి చేసిన లక్నో రింగ్‌రోడ్‌లోని మూడు విభాగాలను, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.2,950 కోట్లతో అభివృద్ధి చేసిన జాతీయ రహదారి-16లోని ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సుమారు రూ. 3,400 కోట్లతో NH-21 కిరాత్‌పూర్ నుంచి నెర్‌చౌక్ సెక్షన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. కర్ణాటకలోని రూ.2,750 కోట్లతో దోబస్‌పేట్-హెస్కోటే సెక్షన్‌ను, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.20,500 కోట్ల విలువైన 42 ఇతర ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారని పీఎంఓ పేర్కొంది.