Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి!
నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి చేసిన సూర్య ప్రకాష్ అసలు నిజాలు అతని కుటుంబ సభ్యులే బయటపెట్టారు. ఆస్తులు, డబ్బుల కోసం అతను కన్నతల్లిని, సొంత తమ్ముడిని, కుటుంబాన్ని బెదిరించడంతో పాటు సుమారు రూ.70 లక్షల నగదు, బంగారం, ఆస్తులను దోచుకుని వారిని రోడ్డున పడేశాడు. రెండేళ్ల కిందట నుంచే ఐపీఎస్ అధికారిగా నటిస్తూ కుటుంబ సభ్యులను నమ్మబలికాడు. ఐపీఎస్ ఉద్యోగం వచ్చిందని నమ్మించి ఇంట్లో వారిని బెదిరించి, అందిన కాడికి దోచుకున్నాడు. అతనిపై కుటుంబ సభ్యులు గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
పోలీసుల అదుపులో నిందితుడు
తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా, ట్రైనీ ఐపీఎస్ అధికారిగా యూనిఫామ్‌లో పాల్గొన్న సూర్య ప్రకాష్ తప్పుడు పని బయటపడింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సూర్య ప్రకాష్ నడవడిపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అతడి నకిలీ ఐపీఎస్ వేషం బయటపడింది. దర్యాప్తులో, సూర్య ప్రకాష్ తండ్రి దత్తిరాజేరులో 9 ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఆ భూమిని తన సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారిగా నటించినట్లు తేలింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.