Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్ డిపో
రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు. పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో పనిచేసే ఈ డిపోకు 'సఖి డిపో' అని పేరు పెట్టారు. డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా మొత్తం 225 మంది మహిళా సిబ్బందితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మహిళలు ఇప్పటికే బస్ కండక్టర్లుగా తమ ప్రతిభను చాటుతుండగా, ఇప్పుడు డ్రైవర్లుగా పనిచేయడం ద్వారా రవాణా రంగంలో కొత్త మైలురాయిని చేరుకోవచ్చని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది దేశంలో మహిళా సాధికారతకు కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగుల సమస్యలపై మంత్రి స్పందన
సమయానుకూలమైన సౌకర్యాలు, స్థిరమైన ఉద్యోగాలు, 'ఫిక్స్‌డ్ జీతం' కోసం తమ డిమాండ్లను ఉద్యోగులు వెల్లడించారు. ఉదయం 6 గంటలకే బయల్దేరి ప్రయాణించాల్సి వస్తోందని, సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలు విన్న మంత్రి మెరుగైన వసతులు కల్పించేందుకు, అలాగే వారి డిమాండ్లపై చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారు. ఈ డిపోతో మహిళా సాధికారతకు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో మహిళా సాధికారతకు చిరునామాగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని రవాణా శాఖ వ్యక్తం చేసింది.