LOADING...
Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్‌ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్‌ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ

Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్‌ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను జోడించేలా రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు. కాకతీయుల కాలానికి చెందిన ఈ చెరువులో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టును పర్యాటకులను ఆకర్షించే విధంగా హృదయాకారంలో (లవ్ సింబల్‌) ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషంగా నిలుస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం రూ.4.22 కోట్ల వ్యయంతో, 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వంతెన నిర్మాణం జరుగుతోంది.

వివరాలు

తుది దశకు బ్రిడ్జి నిర్మాణ పనులు 

ఈ ప్రాజెక్టు కేవలం గ్లాస్ బ్రిడ్జి వరకే పరిమితం కాకుండా, చెరువు పరిసరాలను సమగ్ర వినోద కేంద్రంగా తీర్చిదిద్దేలా పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బతుకమ్మ ఘాట్‌, వాకింగ్ ట్రాక్‌, పచ్చదనంతో అలరించే గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్‌, ఆకట్టుకునే సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరో రెండు నుంచి మూడు నెలల్లో సాంకేతిక, భద్రతా తనిఖీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణ దశలోనే స్థానికులతో పాటు పర్యాటకులు కూడా దీనిని చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement