LOADING...
Jihadi Drug : దేశంలో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టుబాటు.. దీన్ని వాడితే ఏమౌతుందో తెలుసా?
దేశంలో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టుబాటు.. దీన్ని వాడితే ఏమౌతుందో తెలుసా?

Jihadi Drug : దేశంలో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టుబాటు.. దీన్ని వాడితే ఏమౌతుందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో తొలిసారిగా 'జిహాదీ డ్రగ్'గా పేరుగాంచిన కాప్టాగన్ భారీ మొత్తంలో పట్టుబడటం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ రేజ్ పిల్'లో భాగంగా నిర్వహించిన దాడుల్లో ఈ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా క్యాప్టగాన్‌గా పిలిచే ఈ మత్తు పదార్థాన్ని నార్కోటిక్స్ విభాగం 'జిహాదీ డ్రగ్'గా పేర్కొంటోంది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ డ్రగ్ భారతదేశానికి రావాల్సిన సరుకు కాదని, మధ్య ఆసియాకు తరలించాల్సిన ప్యాకేజీ ఇండియా మీదుగా వెళ్తుండగా పట్టుబడినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో నార్కోటిక్స్ అధికారులు ఈ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ సుమారు రూ.182 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వివరాలు

జిహాదీ డ్రగ్ అంటే ఏమిటి?

గల్ఫ్ దేశాలకు తరలించే ప్రయత్నంలో ఈ డ్రగ్‌ను గుర్తించినట్లు, ఈ కేసులో ఓ సిరియా దేశస్థుడిని అరెస్టు చేసినట్లు అమిత్ షా వెల్లడించారు. క్యాప్టగాన్ అనే ఈ డ్రగ్‌ను 'జిహాదీ డ్రగ్'గా పిలవడానికి కారణం దీని ప్రభావమే. ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే వ్యక్తుల్లో అసాధారణ ఉత్తేజం పెరుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు భయాన్ని తగ్గిస్తుంది. ఈ కారణంగానే పలు మిలిటెంట్ గ్రూపులు ఈ డ్రగ్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ISIS వంటి ఉగ్రవాద సంస్థలు తమ నెట్‌వర్క్‌లో పనిచేసే సభ్యులకు, యుద్ధాల్లో పాల్గొనే వారికి ఈ డ్రగ్‌ను అందిస్తున్నట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

వివరాలు

అసలు దీన్ని ఎందుకు అభివృద్ధి చేశారు?

ఈ డ్రగ్ ప్రభావంతో ఉగ్రవాదుల్లో నిర్లక్ష్య ధోరణి పెరగడంతో పాటు భయం పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా వారు ఎలాంటి దారుణాలకు అయినా వెనుకాడకుండా పాల్పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిరియాతో పాటు పలు ప్రాంతాల్లోని ఐసిస్ స్థావరాల్లో గతంలో ఈ డ్రగ్స్ పెద్దఎత్తున లభించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మిలిటెంట్ గ్రూపులు ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, ఈ డ్రగ్‌ను మొదట అభివృద్ధి చేసిన ఉద్దేశం వేరు. 1960లలో దీనిని తొలిసారిగా తయారు చేశారు. మందగమనంతో బాధపడే వ్యక్తులను చురుకుగా ఉంచేందుకు ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఆ సమయంలో దీనికి 'Fenethylline' అనే పేరు పెట్టారు.

Advertisement

వివరాలు

ఈ డ్రగ్ వల్ల వచ్చే ప్రమాదాలు

అయితే కొంతకాలం తర్వాత ఈ మందును వినియోగిస్తున్న వారు దానికి బానిసలుగా మారుతున్నారని గుర్తించడంతో, అనేక దేశాలు 1980లలో దీనిపై నిషేధం విధించాయి. అనంతరం పలు మార్పులు చేసి దీన్ని కొత్త రూపంలో 'క్యాప్టగాన్' పేరుతో మళ్లీ అభివృద్ధి చేశారు. ఈ 'జిహాదీ డ్రగ్'ను అధికంగా వినియోగించడం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక రుగ్మతలు, సైకాలజికల్ డిజార్డర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కొద్దిమాత్రలో తీసుకున్నా కూడా ఇది ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈడ్రగ్ ప్రభావంతో వ్యక్తుల్లో విపరీతమైన కోపం, ఆవేశం పెరుగుతాయి. మంచి-చెడు మధ్య తేడాను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వ్యక్తి ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement