Underwater metro: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. రేపు ప్రారంభం
India's 1st underwater metro service: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అండర్ వాటర్ మెట్రోతో పాటు, కవి సుభాష్-హేమంత్ ముఖోపాధ్యాయ మెట్రో సెక్షన్, తరటాలా-మజెర్‌హట్ మెట్రో సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. దీనితో పాటు, దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మెట్రో మరియు వేగవంతమైన రవాణా ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇది కాకుండా, పింప్రీ చించ్‌వాడ్ మెట్రో-నిగ్డి మధ్య పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్ 1 విస్తరణకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.
అండర్ వాటర్ మెట్రో ప్రత్యేకతలు..
దేశంలో ఒక నదికి కింద నిర్మించిన మొదటి సొరంగం,, కోల్‌కతా మెట్రో హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ మెట్రో టన్నెల్ కావడం గమనార్హం. హౌరా మెట్రో స్టేషన్ భారతదేశంలోనే అత్యంత లోతైనదిగా రైల్వేశాఖ చెబుతోంది. ఈ మెట్రో హౌరా మైదాన్- ఎస్ప్లానేడ్ మధ్య నడుస్తుంది. అండర్ వాటర్ మెట్రో టన్నెల్ హుగ్లీ నది నీటి స్థాయికి 32 మీటర్ల దిగువన నడుస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కొత్త రవాణా విధానాన్ని అందించడమే కాకుండా, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నీటి అడుగున నిర్మించిన ఈ మెట్రో సర్వీస్.. హౌరా-కోల్‌కతాలను కలుపుతుంది. అండర్ వాటర్ మెట్రో టన్నెల్ తప్పుకుండా ఒక గొప్ప ఇంజనీరింగ్ ఫీట్ అవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.