LOADING...
Telangana: వేగం పెంచిన ప్రభుత్వం.. మే నాటికి రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు పూర్తి
వేగం పెంచిన ప్రభుత్వం.. మే నాటికి రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు పూర్తి

Telangana: వేగం పెంచిన ప్రభుత్వం.. మే నాటికి రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు పూర్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌, అలాగే హౌసింగ్‌ శాఖ కార్యదర్శి గౌతమ్‌ హజరయ్యారు. హైదరాబాద్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ స్థాయిలో ఉన్నా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. చివరి దశలో ఉన్న ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

వివరాలు

మౌలిక వసతుల కల్పనకు రూ.400 కోట్లు

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే జరిగిన ఖర్చును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అందిస్తామని తెలిపారు. గుత్తేదారులు పనులు పూర్తి చేయని చోట లబ్ధిదారులే స్వయంగా నిర్మాణాన్ని కొనసాగించుకోవచ్చని చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన మంత్రి పొంగులేటి, రెండు పడక గదుల ఇళ్లు అనర్హుల ఆక్రమణలో ఉంటే తొలగించి అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.400 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వివరాలు

అర్హులకు ఇళ్లు మంజూరు చేయడం కలెక్టర్ బాధ్యత

బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌తో పాటు సర్వీసు నుంచి తొలగింపుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయడం కలెక్టర్ల బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాల కంటే దరఖాస్తు తేదీ ముఖ్యం కాదని, అర్హతే ప్రధానమని స్పష్టం చేశారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని, దుర్వినియోగం కాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నగరానికి దూరంగా నిర్మించిన రెండు పడక గదుల కాలనీల్లో లబ్ధిదారులు ఉండటానికి ఆసక్తి చూపడం లేదన్నారు.

Advertisement

వివరాలు

4,500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యం

పలువురు ఇళ్లను అద్దెకు ఇచ్చి నగరాల్లోనే నివసిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇలాంటి వారిని గుర్తించి, వారు నివసిస్తున్న సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించే అంశంపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. అదే సమావేశంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 30 కేవీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. దీని ద్వారా నెలకు సుమారు 4,500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని, హౌసింగ్‌ భవన వినియోగంలో ఈ మేరకు విద్యుత్‌ ఆదా అవుతుందని కార్యదర్శి గౌతమ్‌ వివరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

వివరాలు

సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలి

రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకోసం సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఇది సహాయపడుతుందని తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్లు లేదా మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉద్దేశించలేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి శ్రీధర్‌బాబు కూడా సమావేశంలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిష్కరించేలా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్యదర్శి గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement